వైష్ణవులు, గణాపత్యులు, కాపాలికులు, చీనమార్గరతులు, వల్కలదారులు, దిగంబరులు, బౌద్ధులు, చార్వాకులు, పాషండులు ఇలా ఎన్నో తెగలవారు వేదములందు శ్రద్ధలేని వారై ప్రవర్తిస్తూ ఉంటారు కదా! ఇందరు ఇంతమంది దేవతలను కొలుచుటకు కారణం ఏమిటి? మతిమంతులు, పండితులు, నానాతర్కములందు నేర్పరులు, వేదములందు శ్రద్ధ మాని ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవడైనా తన బుద్ధితో తన చెడ్డ కోరుకోరు కదా! ఈ భిన్నత్వమునకు కారణమేమి? అని వ్యాసుడిని జనమేజయుడు అడిగాడు.
వ్యాసుడు ఇలా చెప్పాడు.. జనమేజయా! పూర్వం ప్రాణుల కర్మవశమున పదిహేను సంవత్సరాలపాటు వానలు లేవు. ఆ అనావృష్ఠి వలన సర్వనాశనం జరిగింది. కరువులు ఎక్కువై ఇంటింటా జనులు మృతి చెందుతూ ఉన్నారు. కొందఱు ఆకలి బాధ తట్టుకోలేక గుఱ్ఱములను, ఏనుగులను, పందులను తినగా మఱికొందరు పీనుగులను పీక్కుతినేను, మఱికొందరు తల్లి బిడ్డను, భర్త భార్యను, భార్య భర్తను పీక్కుతినేను.
అప్పుడు బ్రాహ్మణులందరు బాగా అలోచించి ఈ సమయములో మహాతపస్వి యైన గౌతముడు ఒక్కడే ఈ బాధలను మాన్పగలిగినవాడు. కనుక మనమందరూ కలిసి గౌతముని ఆశ్రమము వద్దకు వెళదాం. అయన గాయత్రీ ఉపాసనాపరుడు కావడం చేత అక్కడ సుభిక్షంగా ఉన్నది. ఆచోట అనేకమంది సుఖంగా బ్రతుకుతున్నారు. అని తలచి సాగ్ని హోత్రులు గృహస్థులు అయిన విప్రులు తమతమ ఆలమందలతో దాసదాసీ జనంతో నలుదిక్కుల నుండి గౌతముని ఆశ్రమం చేరారు. గౌతముడు వారి రాకను గమనించి వారికి నమస్కరించి వచ్చినవారికి తగిన ఆసనములు ఇచ్చి గౌరవించి కుశలప్రశ్నలు అడిగి వారి రాకకు కారణం అడిగెను. వారందఱూ తమతమ కష్టములు చెప్పుకొనగా వారందరికీ అభయమిచ్చి "ఇది మీ ఇల్లు, నేను మీదాసుడను. మీదాసుడైన నేనుండగా మీకీ విచారం ఎందుకు? తపోధనులైన మీరాక వలన చెడు సైతం మంచిగా మారగలదు. మీ అందరి పాదధూళి చేత నా గృహం పావనమైనది. మీరందఱూ సంధ్యాజప పరాయణులై ఇక్కడే సుఖంగా ఉండండి. అని వారందరినీ ఊరడించాడు.
అనంతరం గాయత్రీ దేవి భక్తి పరాయణుడై గాయత్రిని ప్రార్ధించాడు. వేదమాత! పరాత్పరా! మహా విద్యా!. ప్రణవ స్వరూపిణి! సకలార్ధ ప్రదాయిని! విశ్వరూపిణి! సచ్చిదానంద స్వరూపిణి! సర్వవేదాంత వేద్య, సూర్యమండలం నివాసిని!ఉదయమున రక్తవర్ణవు, బాలవు, మధ్యాహ్నమున నవయువతివి! సాయంకాలమున కృష్ణ వర్ణవు-వృద్ధవు! నిత్యమూ నీకు శతకోటి నమస్సులు! సకల ప్రాణులను తరింపజేయు పరమేశ్వరీ నా అపరాధములు క్షమింపుము. అని స్తుతించగా విని గాయత్రీదేవి ప్రత్యక్షమై ఒక అక్షయ పాత్ర ఇచ్చి "ఈపాత్ర ఎందరినైనా పోషించగలదు. గౌతమా!నీవు కోరినదెల్లా ఈపాత్ర నీకు ఈయగలదు. అటువంటి పాత్రను నీకు ఒసంగితిని" అని చెప్పి పరమ కళ యగు గాయత్రీదేవి అదృశ్యమయ్యెను.
అప్పుడు ఆపాత్ర నుండి అన్నము, షడ్రసములైన పదార్ధములు, పలురకములైన పాత్రలు, వస్త్రములు, ఆభరణములు రాసులు రాసులుగా వెలువడ్డాయి. గౌతముడు ఏది అడిగినా అడిగిన ప్రతి వస్తువు ఆపాత్ర నుండి ప్రత్యక్షమైంది. అంతట గౌతమ మహర్షి అందరిని పిలిచి ధనకనక వస్తు వాహనములు, వస్త్రములు, ఆభరణములు, సొమ్ములు ప్రదానము చేసాడు. ఇంతెందుకు! గొఱ్ఱెలు, బఱ్ఱెలు, గోవులు పశువులు, యజ్ఞ పరికరములైన స్రుక్కు స్రువములు కూడా వచ్చాయి. ముల్లోకములందు ఏయే వస్తువులు గలవో అన్ని ఆ పాత్ర నుండి వచ్చాయి. దీంతో గౌతముడు యజ్ఞం చేయతలచి అందరిని ఆహ్వానించి యజ్ఞ విషయం చెప్పగా అందరూ కలిసి యజ్ఞం ఆరంభించారు. స్త్రీలు దివ్యాభరణములు ధరించి దేవతాస్త్రీల వలె అలరారారు. పురుషులు వస్త్రములు ఆభరణములు దాల్చి దేవతల వలె వెలుగొందారు. ఈవిధంగా గౌతమయుని ఆశ్రమం నందు నిత్యోత్సవములు జరుగుతూ ఉన్నాయి. అక్కడ రోగభయము కాని మృత్యు భయము గాని దైత్య భయము కానీ మచ్చుకకైనా లేదు. ఈవిధంగా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేవారితో గౌతమముని ఆశ్రమం నూరు ఆమడల దూరం వరకు వ్యాపించింది. గౌతముడు వచ్చినవారందరికీ అభయమిచ్చి పోషిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నో విధములైన మహాయజ్ఞాలు చేశాడు. అందఱు గౌతముడిని వేయినోళ్ల పొగిడారు. ఇంద్రుడు సైతం ఇంద్రసభలో గౌతముడ్ని ప్రశంసించాడు.
ఆహా! గౌతముడు ఇప్పుడు మాకు మహాకల్ప వృక్షం వంటివాడు అయ్యాడు. అతడు కీర్తిమంతుడై మా కోరికలు తీర్చుతున్నాడు. గౌతముడే లేనిచో మాకీ యజ్ఞముల యందు హవిర్భాగములు ఎక్కడివి? గౌతముడు ఎల్లవారిని కన్నబిడ్డల వలె పోషిస్తున్నాడు అంటూ కీర్తించాడు. గౌతముడు తన ఆశ్రమమును గాయత్రీ పీఠముగా మార్చాడు. ఆనాటి నుండి మునులందరూ గాయత్రీదేవిని పూజిస్తూ ఉన్నారు. అచ్చట నేటికీ గాయత్రీ ఉదయం బాలగా, మధ్యాహ్నం యవ్వనవతిగా, సాయంకాలం వృద్ధగా దర్శనం ఇస్తుంది.
ఒకనాడు నారదుడు వీణను మీటుకుంటూ గాయత్రీ జపం చేసుకుంటూ గౌతముని ఆశ్రమం వద్దకు రాగా గౌతముడు నారద మహర్షిని ఆహ్వానించి తగిన రీతిలో గౌరవించి ఆసనమివ్వగా నారదుడు సంతోషించి గౌతమ మహర్షిని కొనియాడి "మహర్షి! నీకీర్తి దిగంతాలవరకు వ్యాపించింది. దేవేంద్రుడు సైతం నిన్ను కీర్తించగా చూడవలెననే వేడుకతో ఇచ్చటికి వచ్చాను. గాయత్రీ వరప్రసాదమున నీవు ధన్యుడవైతివి. అని నారదుడు గౌతముడిని పొగిడి గాయత్రీ ఉన్నచోటికి వెళ్లి ప్రణమిల్లి ప్రేమభక్తితో పెల్లుబికిన హృదయంతో దేవిని సందర్శించాడు. పలురీతిగా స్తుతించి స్వర్గానికి వెళ్ళాడు. ఈవిధముగా గాయత్రీ దయవలన గౌతముడు మునులందరినీ పోషించగా గౌతముని కీర్తి ప్రతిష్ఠలు వినివిని మునులందరూ అసూయ చెందారు. కీర్తిని వమ్ముచేయాలని తలచారు. సమయం వచ్చినపుడు చూసుకుందామని వేచి ఉండగా కొంతకాలానికి వర్షాలు పడ్డాయి.అడవులు దేశములు పాడిపంటలతో పచ్చని పైరుతో కళకళలాడాయి. అదివిని బ్రాహ్మణులందరు ఒకచోట గుమిగూడారు.
Indonasia ...
Nepal
Tibet
Tibet
jquery image gallery
image slider jquery 
0 comments:
Post a Comment