:::: MENU ::::

Monday, October 17, 2016



ఈ మధ్య అంతర్జాలంలో ఎక్కడ చూసినా మంత్రాలు తంత్రాలు అంటూ ఒకటే ఊదర కొట్టేస్తున్నారు. ఈ మంత్రం వలన ఫలానా లాభం వస్తుంది అనగానే వాటిని చాలామంది తీసేసుకొని చదివేస్తున్నారు. మంత్రం ఫలించకపోతే మంత్రాలకి చింతకాయలు రాలవు? మంత్రం వలన ఎలాంటి ఉపయోగం లేదు. దేవుళ్ళు దండగ.. దేవుడు లేడు దెయ్యం లేదు అంటూ గోగ్గోలు పెడుతున్నారు. మరికొందరు దొంగ గురువులని ఆశ్రయిస్తున్నారు. వారి వలన నిజమైన గురువులకి నిందలు తప్పడంలేదు.

మంత్రం మననం చేయాలి అంటే గురు కటాక్ష్యం తప్పనిసరిగా ఉండాలి. గురుకటాక్ష్యం లేకపోతే మంత్రం సిద్దించదు. పైగా బెడిసికొట్టే ప్రమాదం ఉంది. మంత్రాలకి చింతకాయలు రాలతాయ! అంటే అవసరమైతే రాలతాయి. నీలో అనుష్టానం చేసే శక్తి ఉండాలి. ఆశక్తి నీలో లేనప్పుడు, మంత్రం మీద నమ్మకం లేనప్పుడు మంత్రం ఫలించదు. ఇక్కడ ఒక చిన్నకథ చెప్పుకుందాం. అప్పుడు గాని మంత్రం విలువ తెలియదు.

ఒక ఊరిలో ఒక దారిద్ర బ్రాహ్మణుడు ఉన్నాడు. యితడు చిన్ననాటి నుండి నిత్యం జపతపాలు చేస్తూ ఉండేవాడు. పెడితే తినేవాడు లేదంటే అలాగే ఉండేవాడు. ఇంటి విషయం పట్టించుకునేవాడు కాదు. యస్సుయుక్తవు వచ్చాక వివాహం చేశారు. భార్య ఉత్తమురాలు. పల్లెత్తి మాట్లాడేది కాదు. పెళ్ళయ్యాక కూడా ఇంటి వ్యవహారాలు చూసేవాడు కాదు. వీరికి సంతానం కలిగింది.8 మంది పిల్లలు పుట్టారు.

వీరికి ఆహారం ఎలా అనే విషయం కూడా పట్టించుకోకుండా ఇతనికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వెళ్లి తినేసివచ్చి జపం చేసుకునేవాడు. ఇలా చాలాకాలం గడిచింది. ఒకరోజు ఎందుకో భోజనం చేసిన తరువాత ఇంటికి ఇంట్లోకి వెళ్లి చూశాడు. తోటకూడా కాడలు ఉడకబెట్టుకొని భార్యా పిల్లలు ఆ నీళ్ళు త్రాగుతున్నారు. చూసి చలించిపోయాడు. ఒక్కోరికి డొక్కలు ఎండిపోయి, ఎముకల గూళ్ళు బయటికి తన్నుకొచ్చాయి. భార్య కూడా పీలగా తయారయ్యింది. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి. ఏంటి ఇలా అయిపోయారు అని అడిగాడు. అప్పుడు విషయం వివరించి చెప్పింది.

మీరు ముష్టి ఎత్తుకు తీసుకొచ్చే ధాన్యం మీకు మాత్రమే సరిపోతుంది. మేము రోజు దొడ్లో పండే తోటకూర ఆకులు వండుకొని తింటున్నాం. అని చెప్పింది. చలించిపోయాడు. ఇప్పుడు ఏమి చేయమంటావు అని అడిగితే! ఇక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఒక యోగీశ్వరుడు ఉన్నాడట. అయన దగ్గరికి వెళ్ళండి. అని చెప్పగానే వెంటనే ఆక్షణం లోనే అక్కడికి చేరుకున్నాడు. ఒక వట వృక్షం క్రింద ద్వియ తేజస్సుతో వెలిగిపోతున్న యోగీశ్వరుడిని చూసి వెంటనే వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి తన కష్టం చెప్పుకున్నాడు. గురువు వెంటనే నీళ్ళు తెమ్మన్నాడు. దగ్గరలో ఉన్న నదిలో నీళ్ళు తెచ్చి స్వామి పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకున్నాడు. అప్పుడు స్వామి అతడికి ఒక మంత్రం ఉపదేశించి ఎదురుగా కనిపిస్తున్న చెట్టు చూపించి దానిక్రింద కూర్చొని ఈ మంత్రాన్ని 24 గంటలు ఆగకుండా జపం చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. అని చెప్పగా యితడు చెట్టు దగ్గరికి వెళ్లి మొదలు దగ్గర బాగోలేదని ఎండగా ఉందని, ఎత్తుపల్లాలుగా ఉందని, వాన వస్తే తడిసిపోతానేమోనని ప్రక్కన చిన్న గుడిసేలా వేసుకొని అందులో జపం చేయడం మొదలుపెట్టాడు. రోజు గడిచింది, వారం గడిచింది, నెల గడిచింది. మంత్రం పట్టు ఇవ్వడంలేదు. కొంచం సేపు జపం చేయడం సరిగ్గా చేస్తున్నానా? దైవం ప్రత్యక్షమైందా? అని చూసుకోవడం, మళ్ళి జపం చేయడం ఇలా నెలలు గడిచిపోతున్నాయి. మంత్రం మాత్రం పట్టు ఇవ్వడంలేదు.

దీంతో గురువుగారి మీద మండిపోయింది. వీడేదో మంచి గురువు అనుకున్నాను. దొంగ గురువు, నీచ్యుడు, వీడికి మంచి మంత్రాలు తెలియవు. అసలు వీడు మంత్ర వేత్తేనా? లేక మంచి మంత్రం ఇవ్వలేదా? అనుకోవడం మళ్ళి జపం చేయడం, ఇలా గురువుని తిట్టుకోవడం, మంత్రం మీద నమ్మకం లేకపోవడం సంవత్సరం గడిచింది. అంతకంతకీ గురువుని దూషించడం జపం చేయడం.. ఇదే వృత్తి అయిపొయింది. కాని మంత్రం వదల కుండ చేస్తూనే ఉన్నాడు. సంవత్సరం దాటిపోయింది..

ఒకరోజు అక్కడికి ఒక బోయవాడు వచ్చాడు. కాళ్ళు చేతులు పుళ్ళు పడిపోయి, రసి కారుతూ, కొన్ని వెళ్ళు ఊడిపోయి, చూడడానికి జుగుప్స కలిగి ఉన్నాడు. ఆ బోయవాడు ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అయ్యా! నాకు ఒక మంచి గురువుగారు కావాలండి, ఎవరైనా ఉంటె చూపించండి అన్నాడు. వాడి చూసి అసహ్యించుకుంటూ దూరంగా నిలబడు. నాకు గురువు దొరక్క అదిగో దూరంగా చెట్టు క్రింద కూర్చున్నాడే వాడి దగ్గరికి వెళ్లాను. వాడు దొంగ గురువు. ఎదో పనికిరాని మంత్రం నామోహన కొట్టాడు. ఇప్పటికి సంవత్సరం నుండి చేస్తున్నాను. మంత్రం పని చేసి చావదు. వాడి దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఇంకేవడినైన చూసుకో. అన్నాడు.

ఈబోయవాడు బ్రాహ్మణుడికి ఎగాదిగా చూసి ఆ గురువుని చూస్తుంటే తేజస్సు ఉట్టి పడుతుంది. మాములు వారికి అంత తేజస్సు ఉండదు. అయన సద్గురువు అని చూడగానే కనిపెట్టేశాడు. ఈ బ్రాహ్మణుడు ఒద్దు అన్న గురువు దగ్గరికే వెళ్ళాడు. తన పరిస్థితి వివరించాడు. వెంటనే ప్రక్కనే ఉన్న తిత్తి వేయమన్నాడు. చేతులు చూస్తే పుళ్ళు పడి ఉన్నాయి. రసి కారిపోతుంది. అయినాసరే గురువుగారు చెప్పిన మాట తప్పకుండ తిత్తి కొడుతూనే ఉన్నాడు. ఒకరోజంతా ఆగకుండా అలాగే తిత్తి కొట్టించాడు. అంత బాధ ఉన్నా పళ్ళ బిగువునా భరించి తిత్తి కొట్టాడు. పాదాలు కడగడానికి నీళ్ళు తీసుకురమ్మంటే నది వరకు వెళ్ళకుండా అక్కడే ప్రక్కనే తొట్లో ఉన్న నీరు తీసుకొని పాదాలు కడిగి అదే గంగా తీర్ధం అని పాదతీర్థం పుచ్చుకున్నాడు. ఆ భక్తికి గురువు నిశ్చేష్టుడు అయిపోయాడు. కాని గురువుగారికి ఒక సందేహం వచ్చింది. వీడు చూస్తే అధమజాతి. వీడికి మంత్రం ఇవ్వవచ్చా? ఇవ్వ కూడదా! అని బోయవాడిని వెనక్కి తిరిగి కూర్చో.. పిలిచేవరకు నావైపుకి తిరిగి చూడకు అన్నాడు. సరేనని వెనక్కి తిరిగాడు.

అప్పుడు గురువుగారు ఆంజనేయ స్వామిని పిలిచి స్వామి వీడు అధమజాతి వాడు. వీడికి మంత్రోపదేశం చేయవచ్చా! అని అడుగగా వీడు వాడు అని తేడాలేదు. భక్తుడు ఎవరైనా, కష్టంలో ఎవరున్నా, గురువు మీద భక్తి శ్రద్ధలతో ఎవరు ఉపచారం చేసినా శ్రద్ధతో మెలిగే ఎవరికైనా మంత్రోపదేశం చేయవచ్చు. గురువుని తల్లిదండ్రులని, భార్యపిల్లలని గౌరవిన్చేవారికి ఇవ్వవచ్చు. వీడికి కూడా ఇవ్వవచ్చు. అని మంత్రోపదేశం చేయమన్నాడు. హనుమంతుడు చెప్పినట్లు గురువుగారు మంత్రోపదేశం చేశారు. ఎదురుగా కనిపిస్తున్న చెట్టు దగ్గర కూర్చొని జపం చేయమన్నారు. 48 గంటల్లో సిద్ధిస్తుంది అని చెప్పారు. గురువుగారు చెప్పినట్లే చేయగానే 48వ గంట ముగియడంతో ఆంజనేయుడు ప్రత్యక్షమై బోయవాడిని నిమిరి రోగాలు బాపి సకల సంపదలు ఇచ్చి మాయమయ్యాడు. ఒళ్ళంతా బంగారం రంగులో ధగధగ మెరిసిపోతూన్న బోయవాడు గురువుగారి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారికి సేవ చేస్తూ ఉండగా! నాయనా! ఇక వెళ్లి నీ పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉండు. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించు. ఇక వెళ్ళు అనగానే! కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని గురువుగారికి పాదాభివందనం చేసి వదలలేక వదలలేక బయలుదేరాడు.

ఎదురుగా ఈ బ్రాహ్మణుడి గుడిసె కనబడింది బోయవాడికి. గురు దూషణ చేసినవాడికి, కోపిష్టి వాడికి, పెద్దలను, గోవులను, బ్రాహ్మణులను నిందిన్చేవాడికి, వ్యభిచారికి, జూదగాడికి, సురాపానం చేసేవాడికి, దొంగలకి దూరంగా ఉండమని లేదంటే ఆపాపం వారితో స్నేహం చేసేవారికి అంటుంది అని పెద్దలు చెప్పారు. అనుకొని తల తిప్పుకొని దూరంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంతలో ఈ బోయవాడిని చూడనే చూసి పిలిచాడు. ఆహా! చూశాడా! పిలవనే పిలిచాడు. రామరామ! అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. నిన్ను ఎక్కడో చూసినట్లుంది. నువ్వు ఆ బోయవాడివి కదు. ఎవరిచ్చారు నీకు మంత్రం? ఆ గురువుగారు ఎవరో నాకు చెప్పు అనగా! ఎదురుగా వట వృక్షం క్రింద కూర్చుని ఉన్న గురువుగారిని చూపించాడు. వెంటనే! వాడా! వాడా నీకు ఉపదేశించింది. నీకు మంచి మంత్రం ఇచ్చి నాకు పని చేయని మంత్రం ఇస్తాడా! నువ్వు వెళ్ళు వాడి సంగతి నేను తేలుస్తా! అని కొరకొర పళ్ళు కొరుకుతూ గురువుగారి దగ్గరికి వెళ్లి ఒరేయ్! దొంగ గురువా! అని పిలిచాడు.

ఎవరు నాయనా! అంతమంచి బిరుదు ఇచ్చారు? అంటూ కళ్ళుతెరచి చూసి ఎం నాయనా! నువ్వా! ఏమిటి ఇలా వచ్చావు అనగా! వాడికేమో మంచి మంత్రం ఇస్తావా! నాకేమో పనికిరాని మంత్రం ఇస్తావా! నువ్వు అసలు గురువు వేనా! అన్నాడు. గురువుగారు చిరునవ్వు నవ్వి! వాడికి ఎం మంత్రం ఇచ్చానో నీకు తెలుసా! అనగా తెలీదు అన్నాడు. మంత్రాలలో పనిచేసేవి పని చేయనివి అని రెండు తెగలు ఉండవు నాయనా! అనుష్టించడంలో లోపం తప్ప. నీకు ఇచ్చిన మంత్రమే వాడికి ఇచ్చాను. భక్తితో చేసుకున్నాడు. ఫలించింది. నిన్ను నీళ్ళు తెమ్మన్నాను. వాడిని తెమ్మన్నాను. నువ్వు నది వరకు వెళ్లి తెచ్చావు. పోనీ పాదాలు కడిగి ఆ నీళ్ళు శిరస్సు మీద చల్లుకున్నవా! అంటే అదీలేదు. ఎదురుగా కనిపిస్తున్న చెట్టు క్రింద కూర్చోమన్నాను. నువ్వు అక్కడ బాలేదని ఎక్కడో గుడిసె వేసుకున్నావు.

అతడు ఇదిగో ఈ తొట్టెలో ఉన్న నీటిని పవిత్రం అనుకున్నాడు. పాదజలమే గంగ అనుకున్నాడు. చెప్పినపని ఎంత కష్టం అయినా ఓర్పుతో చేశాడు. వినయంతో జపం చేసుకున్నాడు. హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. కోరిన కోర్కె తీర్చుకున్నాడు. అదే నీకు వాడికి తేడా! అని చెప్పగా గురువుగారు క్షమించండి అని ఆ తొట్టెలో నీటితో కాళ్ళు కడిగి, పదజాలం స్వీకరించి మరల మంత్రోపదేశం తీసుకొన్నాడు. ఈసారి భక్తితో నమ్మకంతో చేయడంతో 48 గంటల్లో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.నువ్వు పూర్వజన్మలో బ్రాహ్మణుడివే! ఒకసారి యాత్రలకి వెళుతూ తన గురువు ఇచ్చిన మంత్రాన్ని పెద్దగా చదువుతున్న శిష్యుడిని చూసి అరవడమే కాకుండా అతని గురువుని కూడా తిట్టావు. పైగా పిసినారివి. భార్య పిల్లలకి కూడా రూపాయి ఇవ్వలేదు. వచ్చిన సొమ్ము కూడా బెట్టడమే తప్ప ఎవరికీ పెట్టలేదు. కాని పరమ భక్తుడివి కావడం చేత మళ్ళి బ్రాహ్మణుడిగా జన్మించావు. ఈ జన్మలో నువ్వు ఎంత మంచివాడివి అయినా నీకు సంపదలు లభించలేదు. ఆ గురుద్వేషమే నిన్ను వెంటాడింది. ఈ గురువుని దూషించేలా చేసింది. ఇకనైనా భక్తి శ్రద్ధలతో నడచుకో..నీకు కావలసిన సిరి సంపదలు నీకు లభిస్తాయి. వెళ్ళు అని హనుమంతుడు అదృశ్యమయ్యాడు. గురువుగారికి క్షమాపణలు చెప్పి భక్తితో సేవ చేసి గురువుగారు చెప్పగా ఇంటికి బయలుదేరి వచ్చాడు. తన పూరిపాక ఉన్న స్థలంలో బంగారపు రంగులో ఉన్న భవనం కనబడింది. ఇల్లంతా పనివాళ్ళు, భార్య గుర్తు పట్టలేనంత అందంగా పరిచారికలతో పని చేయించుకుంటూ ఉంది. ఇతను రాకని గమనించి దిష్టి నీళ్ళు, తెచ్చి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించి ఈరోజుకి సరిగ్గా 7 రోజుల క్రితం ఇల్లు ఉన్నట్లుండి మాయమై ఈ 7 అంతస్తుల భవనం వచ్చింది. సంపదలు వచ్చాయి. దసదాసి జనం వచ్చారు. అనగా సరిగ్గా 7 రోజుల క్రితం హనుమంతుడు ప్రత్యక్షమై వరం ఇచ్చిన విషయం చెప్పాడు. అంటే వరం ఇచ్చిన వెంటనే ఇక్కడ సంపదలు వచ్చాయి. దీంతో సంతోషించి దానధర్మాలు చేస్తూ హాయిగా కాలం గడిపి కైవల్యం పొందారు..

మంత్రం అంత శక్తి వంతమైంది..మన నమ్మకాన్ని బట్టే ఫలితం ఉంటుంది. తప్ప ఎం చేసిన ఎలా చేసినా ఫలించాలి. దేవుడు ఉంది ఎందుకు? చేస్తేనే దేవుడా! చేయకపోతే కాదా! అని వితండవాదం చేయకూడదు. నీకు ఎంత భక్తి శ్రద్ధ ఉంటె అంత ఫలితం వస్తుంది. ఆ అనుభవాలు నా జీవితంలో చాలానే జరిగాయి. ఏ స్థాయిలో ఉండాల్సిన వాడిని మా గురువుగారు బ్రహ్మశ్రీ పద్మాకర్ గారి వలన ఏ స్థాయిలో ఉన్నానో నాకు తెలుసు.

అడ్మిన్
శ్రీకృష్ణ..

0 comments:

Post a Comment

A call-to-action text Contact us